'చక్కని చుక్కని చూడరే!' (పాట)
పల్లవి: చక్కని చుక్కని చూడరే సుదతులారా..
జయమని పలుకరే పడతులారా..
వరములొసగుటకు వరలక్ష్మీ రూపేణ..
ఇల తరలొచ్చే ప్రతి గుమ్మానికి మామిడాకులు కట్టి
గడపలకు పసుపు, కుంకుమలు పూసి..
జయము జయమని మనసారా స్వాగతించరే జలజాక్షిని..
||చక్కని చుక్కని చూడరేll
చరణం: ఘల్లు ఘల్లు మని సిరి మువ్వలతో
పసిడి వర్ణ మేని ఛాయతో..
గలగలలాడే గాజుల సవ్వడితో..
ఇంటింట సిరుల పంట పారించేందుకు..పాల కడలినొదలి పరుగు పరుగున వచ్చిన
కలువ రేకుల నేత్రిని..స్వాగతించరే సతులారా..
ll చక్కని చుక్కని చూడరేll
చరణం: ఆర్ఘ్యపాద్యములిచ్చి..
ఎర్రని పూల మాలలు వేసి..
నుదుటిన కుంకమ తిలకం దిద్ది..
చెంపలకు గంధం ఇంపుగ అద్ది..
సిరిలిచ్చు తల్లిని ముదమార సింగారించరె..సుదతులారా..
ll చక్కని చుక్కని చూడరేll
చరణం: పాలు పెరుగు, తేనె, నేయి, చక్కెర ఫలరసాలతో..
అభిషేకించి..పది కాలాల పసుపు కుంకుమల భాగ్యమీయమని వేడరే నిండు మనసుతో..
చల్లని చూపుల కామిత ఫలదాయిని..అక్షయ నిధుల క్షీరాబ్ది పుత్రికని పరిపూర్ణ దీవెనలియ్యమని సేవలు చేయరే చెలియలారా,
ప్రార్థించి..సకల సౌభాగ్యులవరే సుగుణులారా..ముత్తయిదువలారా..
ll చక్కని చుక్కని చూడరేll
---సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.

