ఓ మాపాప.......(బాల గేయం)
పాపా పాపా ఓ మా పాపా
రేపు మాపు ఉయ్యాల ఊప
ముద్దుగ నిద్దుర పోవమ్మా
సుద్దులు వినుకొని నీవమ్మా !
పాపా పాపా ఓ మా పాపా
నీ బంగరు ఊయలమేం ఊపా
కంగారు నీవసలు పడవద్దమ్మా
సింగారం సిరి గల ముద్దుల కొమ్మ !
పాపా పాపా ఓ మా పాపా
బై బై యంటూమేం చేతులూపా
సై సై అంటూ నీవు పోతుంటావు
టాటా చెపుతూ తిరగొస్తుంటావు!
పాపా పాపా ఓ మా పాపాపాపా
నీ ముద్దులకై మేం చేతులు చాప
ఊహూ అంటూ ఎందుకు అంటవు
ఓహో అంటూ మరి తప్పకుంటవు!
.పాపా పాపా ఓ మా పాపా
విసన కర్రతో మేమంతా ఊపా
చేయనే చేయకు మమ్ముల గేలి
తీయనే తీయకు తమ్ముల గాలి!
పాప పాప ఓ మా పాపా
పలక బలపం నువు చూప
వచ్చినవారు నిను మెచ్చేరు
నచ్చిన కానుకలు నీకిచ్చేరు !
పాపా పాపా ఓ మా పాపా
మా కష్టాలను నువు బాప
మా వంశమందున పుట్టావు
మా గుండె తలుపులే తట్టావు !
--- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి,
నాగర్ కర్నూలు జిల్లా.