విజయదశమి వైభవం: శమీపూజ.. పాలపిట్ట దర్శనం వెనుక అంతరార్థం!
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలలో విజయదశమి (దసరా) పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మైసూర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకుంటారు. విజయదశమి ఆవిర్భావం, ఆచారాల వెనుక ఉన్న పౌరాణిక ఐతిహ్యాలు, విశేషాలు ఇవీ...
అమృతోద్భవం – విజయాభయం:
దేవదానవులు పాలసముద్ర మధనం చేసిన వేళ అమృతం ఉద్భవించిన శుభ ముహూర్త దినమే ఈ విజయదశమి అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్రవణా నక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుద్ధ దశమికి 'విజయా' అనే సంకేతం ఉంది. అందుకే ఈ పర్వదినానికి 'విజయదశమి' అనే పేరు వచ్చింది. ఈ పవిత్ర దినాన తిథి, వార, నక్షత్ర, గ్రహబల ముహూర్తాలతో ప్రమేయం లేకుండా ఏ కార్యం ప్రారంభించినా విజయం తథ్యమని నమ్ముతారు. 'చతుర్వర్గ చింతామణి' అనే గ్రంథం ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళే విజయా సమయమని, ఇది సకల కార్యసిద్ధిని కలిగిస్తుందని గురువాక్యం.
శమీపూజ ప్రాశస్త్యం:
దసరా రోజున జమ్మిచెట్టు (శమీ వృక్షం) పూజ చేయడం ప్రధాన ఆచారం. అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ దివ్యాస్త్రాలను, వస్త్రాలను శమీ వృక్షంపైనే దాచి ఉంచారు. అజ్ఞాతవాసం ముగిశాక వృక్ష రూపిణి అయిన 'అపరాజితా దేవి'ని పూజించి, తమ ఆయుధాలను తిరిగి పొంది కౌరవులపై విజయం సాధించారు. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా విజయదశమినాడే అపరాజితా దేవిని ఆరాధించి, రావణాసురుడిని సంహరించి విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా భక్తులు జమ్మిచెట్టు వద్ద క్రింది శ్లోకాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తారు:
శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
ఈ శ్లోకాన్ని కాగితంపై రాసి జమ్మి కొమ్మలకు కట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో పాటు శనిదోష నివారణ కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం.
పాలపిట్ట దర్శనం – ఆనందోత్సాహాలు:
తెలంగాణ ప్రాంతంలో శమీపూజ అనంతరం పాలపిట్టను దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. దసరా సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో గ్రామాల్లో డప్పు చప్పుళ్లతో, పెద్దల ఆధ్వర్యంలో పొలాల వైపు వెళ్తారు. పాలపిట్ట కనిపించగానే "పాలా.. పాలా.." అంటూ చప్పట్లతో ఆనందం వ్యక్తం చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. జమ్మి ఆకులను 'బంగారం'గా భావించి పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ 'అలయ్-బలయ్' తీసుకుంటారు. ఎంతటి పేదవారైనా కొత్త బట్టలు ధరించి దసరా దావత్లతో వేడుక చేసుకుంటారు. కాగా, ప్రస్తుతం పాలపిట్టను బంధించడం చట్టరీత్యా నేరం కాబట్టి, స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్టను ప్రకృతి ఒడిలో వెతుక్కుంటూ వెళ్లి దర్శించుకోవడంలోనే అసలైన ఆనందం దాగి ఉందంటారు.
ఆయుధ పూజ విశిష్టత:
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజున ఆయుధ పూజ నిర్వహించడం విశేషం. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వృత్తి వ్యాపారాలలో ఉపయోగించే పనిముట్లు, యంత్రాలు, వాహనాలు, పుస్తకాలకు ఈ రోజున కృతజ్ఞతగా పూజలు చేస్తారు. వడ్రంగి, వ్యవసాయ పరికరాలు మొదలుకొని ఆధునిక యంత్రాల వరకు శుభ్రపరిచి పూలతో, బెలూన్లతో అందంగా అలంకరిస్తారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు మొదలైన వాహనాలకు దండలు వేసి, దీపారాధన చేసి, గుమ్మడికాయలు కొట్టి పూజిస్తారు. మనం జీవనోపాధి పొందే సాధనాల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను చాటడమే ఈ ఆయుధ పూజ అంతరార్థం.
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్
కామారెడ్డి