స్టేజీఫియర్?... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

స్టేజీఫియర్?... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్


స్టేజీఫియర్?

నీకేమీకోరలు లేవు 
చీల్చేందుకు...
నీ దగ్గర కొరడాలులేవు 
కొట్టేందుకు...
నీకేమి కొమ్ములు లేవు ‌
పొడిచేందుకు...
నీ దగ్గర ఏకే 47 గన్నులులేవు 
కాల్చేందుకు...
నీవు దాదావు కాదు 
దండించేందుకు దఢపుట్టించేందుకు
 
కానీ, నీ దగ్గరకు వచ్చేందుకు 
అందరూ భయపడతారు
గజగజ వణికిపోతారు 
కాళ్ళు వణుకుతాయి
చేతులు చల్లబడతాయి
అరికాళ్ళల్లో అరిచేతుల్లో
ముచ్చెమటలు పడతాయి
పెదాలు ఎండిపోతాయి 

గుండె వేగంగా కొట్టుకుంటుంది
ముఖాలు కళావిహీనమౌతాయి
బిత్తర చూపులు చూస్తారు 
తత్తర పాటుకుగురౌతారు
నోరెండిపోతుంది నిముష 
నిముషానికి దాహమౌతుంది
గుండెనిండా గాలి పీల్చి 
వదులుతారెందుకో పాపం ...
అదే ఉపన్యాస వేదికంటే...
అదే అదే "స్టేజీఫియర్" అంటే...

కానీ కొందరంటారు
వేదికంటే ఒక వేడుకని
వేదికంటే భయంలేదని

ఔను కొందరు నిర్భయంగా
భయపడకుండా తడబడకుండా 
నిర్మలంగా నిశ్చలంగా ప్రశాంతంగా 
నవ్వుతూ వేదికను ఎక్కుతారు
ఆడాలనుకున్న ఆట ఆడేస్తారు
పాడాలనుకున్న పాట పాడేస్తారు
ఇవ్వాలనుకున్న సందేశం ఇచ్చేస్తారు
చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తారు
చేయాలనుకున్న కార్యక్రమాన్ని చేసేస్తారు

నేడు కాస్త సాధన చేస్తే చాలు
రేపు నీవే ఒక విజేతవు కావచ్చు
నీవే ఆ వేదికను నియంత్రించవచ్చు
అందర్నీ మంచి మాటలతో 
మంత్రించి మాయచేయవచ్చు
నవ్వుల పువ్వులు పూయించవచ్చు 
అవార్డులు రివార్డులు అందుకోవచ్చు
సన్మానాలు సత్కారాలు పొందవచ్చు

ఆ శక్తి ఆ యుక్తి ఆ ఓర్పు ఆ నేర్పు 
ఆ సామర్థ్యం నీకుందని రూపించు‌కో !
ఇకపై రామబాణమై సాహసమే ఊపిరిగా
సాగిపో ముందుకు ! సందేహం ఎందుకు ?

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

0/Post a Comment/Comments