భార్యా ! భర్త !! ఆ పరమాత్మ !!!
తమ రక్తమాంసాలను
ముద్దగాచేసి
గర్భగుడిలో
గాడాంధకారంలో
ప్రాణాలకు తెగించి...
ప్రాణప్రతిష్టచేసి
పండంటి బిడ్డను ప్రసవించి...
కెవ్వు మన్న ఓ కేక వినిపించి...
కనులారా బిడ్డను తిలకించి...
ఎత్తుకొని...ఎదకు హత్తుకొని
ముసిముసి నవ్వులురువ్వుతూ
ముద్దులవర్షం కురిపించి...
ఇష్టపడి...ఎంతో కష్టపడి
కన్నాను కదా అని ...నాచిట్టికన్నా
అని ప్రేమతో...పలకరించి...
మేను పులకరించి...
తన్మయత్వంలో మునిగితేలుతూ
అంతులేని ఆత్మతృప్తితో
ఆకాశపుటంచులు తాకిన
ఆనందంతో కట్టలుతెంచుకున్న
పట్టరాని పరమానందంతో
ఆ మాతృత్వపు మధురఘడియలో
మైమరచి పరవశించిపోతుంది
ప్రతిఅమ్మాయి పెళ్ళై ఒక బిడ్డకు తల్లై...
ఔను ఆపై ధన్యమైపోతుంది ప్రతి స్త్రీజన్మ...
ఐతే బిడ్డను
కష్టపడి కన్నది తానేఐనా
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
తెలుపుకుంటుంది మొట్టమొదట
కట్టుకున్న...తన భర్తకు...
ఆపై కనిపించని...ఆ పరమాత్మకు...
కారణం?
నేడు పొత్తిళ్ళలోవున్న ఆ పసికందుకు
తాను తన భర్త అండమై అండగా వున్నా
చీకటి తెరల వెనుక ఎక్కడో అదృశ్యంగా
ఆ పిండానికి ప్రాణదాత.....ఆ పరమాత్మే...
తమ ఇంటికి వెలుగైన తమబిడ్డకు
తాను తన భర్త రెండు కళ్ళైతే
ఆ కళ్ళలో కళాకాంతి........ఆ పరమాత్మే...
ఏ పూర్వజన్మ పుణ్యఫలమో ఏమో
నేడు తమ ఒడి చేరి తమకు
మురిపాలుపెంచే మురిపించే
ముద్దులొలికే ఆ పసిడిబిడ్డకు
తాను తన భర్త శరీరమైతే
ఆ శరీరంలో నున్న ఆత్మ.....ఆ పరమాత్మే...
మరిమీరేమంటారు? ఔనంటారా...కాదంటారా...
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
