అతివా! నేనిష్టమా! కన్నీటి ప్రశ్న
అతివకు నేనిష్టమా!
ఎందుకని చెప్పను
ఏమని చెప్పను...
కలతలకు కన్నీరంటే
మరీ అంతిష్టమా..
పిలవని పేరంటానికి వచ్చినట్టు కనులనుండి
అలా ఉబికుబికి వస్తూనే ఉంటాయి....
కలల నెంతగా దాచుకున్నా కన్నీటిని మాత్రం ఎందుకో రెప్పలు మూసి ఉంచలేవెందుకో..
కొందరు అతివలకు ఆరోతనమేనెమో ఆనంద భాష్పాలు
అశ్రు దారాలు అలంకార శోభితమై అలరిస్తూనో
ఆక్రోశిస్తూనే
అతివ మోముని వీడవేమో నీడలా..
పుడమిపై పడుతూనే
కన్నీరు శిశువు సొంతం ..
ఎదుగుతూనే ఏటికేడు
బుడిబుడి నడకలలో తడబడి నిలబడలేని
చిన్నారికి ఉపశమనం కన్నీరే...
కోరుకున్నది దక్కకున్నా అనుకున్నది జరగకున్నా
ఆత్మబంధువులై ఓదార్చేది కన్నీరే...
ఆడపిల్ల కల్యాణంలోను
ఆ పిమ్మట అత్తవారింటికి
సాగ నంపుటలోను
చోటులేకుండా వుండునా కన్నీటికి...
అలకలలోను ఆత్మీయ స్పర్శలోను ఆలంబన కన్నీటిదేగా..
కనుల కడలినుండీ కురిసే
కన్నీరుకు తెలియదు తను
ఏ మమతల తీరాన్ని దాటాలని...
కరువున
నీటి ఎద్దడి అయి దాహానికి గుక్కెడు నీళ్లు దొరకకున్నా...
ఆకలి ఆక్రోశం ఆవేదన కలగలిసి ఏదొచ్చినా కనులు మాత్రం చెలమలవుతాయి..
కన్నీటి దారలు పొంగిపొరలిస్తాయి...
కొందరన్నువులకు కన్నీళ్లే ముత్యాల ఆభరణమై ఆడంబరమై
ప్రతిరోజు స్పృశిస్తూనే ఉంటాయెందుకో...
తనవారు చులకన చేసినా..
మనవారనేవారు బాద పడినా
కన్నీరెంత కార్చినా కడగండ్లు కరగవెందుకో..
మనిషికి కలతలొచ్చి కన్నీటి వరదలొచ్చినట్టు..
భువికి కలతలొచ్చి బీడుభూములలో కన్నీరు ఉబికి వస్తే
సిరులు పoడినట్టు
పంటలు పండవా..
ఆకలి కేకలు ఆక్రోశిస్తూ
అల్లంత దూరం తరలిపోవా...!!
--- కె.ఆర్. భార్గవి,
పలమనేరు.

మీ కవిత లోని ఆర్తి, ఆవేదన నిన్ను కదిలించి వేసింది. అతివల కన్నీటి వెనుక వ్యధలను అద్భుతంగా ఆవిష్కరించారు. హృదయ మున్న ప్రతి ఒక్కరినీ కదిలించి వేస్తుంది.
ధన్యవాదాలు మేడం.🌹💐💐💐💐🌹